ఉక్కు కార్మిక కుటుంబాలు శోకంలో ఉంటే.. మీరు విజయోత్సవాలు చేసుకుంటారా ?
కూటమి ప్రభుత్వ విజయోత్సవాలపై తెలుగు శక్తి ఆక్షేపణ
పైగా.. ఆ సభలోపరిహారం చెల్లించే విషయంలో మంత్రి నారా లోకేష్ అబద్ధాలు చెప్పారని ఆరోపణ
సకల శాఖా మంత్రిగా నారా లోకేష్ పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని విమర్శ
బాధిత కుటుంబాలు అందరికీ కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని
తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్
విశాఖపట్నం: రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్టుగా... కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటూ ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆరోపించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సంభవించిన ఘోర ప్రమాదంలో 8 మంది సజీవ దహనమై ప్రాణాలను కోల్పోయిన.. వారి కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. మృతుల కర్మ కాండలు కూడా కనీసం పూర్తి కాకముందే ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం చేశారు. శనివారం ఉదయం ఆయన డాబా గార్డెన్స్ లోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల విజయోత్సవ సభలో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించే విషయమై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అబద్ధాలు చెప్పారన్నారు. కోటి రూపాయలు మృతుల కుటుంబాలకు అందజేస్తున్నట్టుగా చెప్పడం వాస్తవం కాదన్నారు. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రాణాలు కోల్పోయిన శాశ్వత ఉద్యోగుల కుటుంబాలకు వచ్చే బెనిఫిట్ లు వివరాలను రామ్ తెలియజేశారు. ఎం.కృష్ణ నాగు రూ. 200.31 లక్షలు, జి.వి.అప్పారావు రూ. 47.70 లక్షలు, కె.ప్రభాకర్ రావు రూ.135.96, జి.భాను కుమార్ రూ. 44.87, గోల్డ్ కుమార్ రూ.79.49 లక్షలు చెల్లిస్తారన్నారు. వీరిలో కేవలం ఇద్దరు కుటుంబాలకు మాత్రమే కోటి రూపాయలు పైగా పరిహారం అందుతుందన్నారు. మరో వైపు టెంపరరీ కార్మికుల కుటుంబాలకు ఎంత మొత్తం పరిహారం వెళుతుందో సమాచారం లేదన్నారు.
ఏది ఏమైనప్పటికీ బాధిత కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని రామ్ డిమాండ్ చేస్తారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పర్మనెంట్ ఉద్యోగులతో పాటు.. టెంపరరీ కార్మికులకు కూడా కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రభుత్వం చెల్లించాలన్నారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ.భరత్ ఎక్కడ?
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోరమైన ప్రమాదం సంబంధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ రావడం సహజమే అయినప్పటికీ.. నారా లోకేష్ రావాల్సిన అవసరం ఏముందన్నారు. అంటే సకల శాఖ మంత్రిగా నారా లోకేష్ అన్ని వ్యవహారాలలోనూ పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. ఘోరమైన ప్రమాదం తర్వాత.. పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ.భరత్ విశాఖ ఉక్కు ప్రమాదం బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చి ఉంటే సమంజసంగా ఉండేదన్నారు. విశాఖ ఉక్కు కర్మ గార బాధితులను పరామర్శించేందుకు తీరుబడలేని పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ.భరత్ కు రెండేళ్ల పరిపాలన విజయోత్సవ సభలో పాల్గొనేందుకు మాత్రం సమయం లభించిందని ఎద్దేవా చేశారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ కి తెలుగు శక్తి ఫిర్యాదు
విశాఖ ఉక్కు ప్రమాదానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కి తెలుగు శక్తి ఫిర్యాదు చేసిందని బి.వి.రామ్ తెలిపారు. ఈ ప్రమాదం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీవ్రమైన నిర్లక్ష్యం ఉందని ఆయన ఆరోపించారు. అందుకే..
కేంద్ర ఉక్కు కార్యదర్శి, సందీప్ పౌండ్రిక్, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, టి.వి.సోమనాధం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సాయి ప్రసాద్ ను బాధ్యులుగా ఫిర్యాదులో పేర్కొన్నామన్నారు. ఈ ముగ్గురికి ఎన్ హెచ్ ఆర్ సి నుంచి సమన్లు అందే అవకాశం ఉందని తెలిపారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్
ఐ.ఎన.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీరుకొండ రామచంద్ర రావు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోరమైన ప్రమాదం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్సకు వచ్చి ఉంటే బాగుండేదన్నారు. ఇప్పటికైనా.. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు పరిరక్షణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విలేకరుల సమావేశంలో టీ.సాంబశివరావు, ఎం.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.