*గిరిజన యూనివర్సిటీ వేడుకల వెనుక ‘నోవాటెల్’ వ్యాపార ప్రమోషన్ దందా*
*
*రాష్ట్రపతి లాంటి మహోన్నత వ్యక్తిని... ఒక చిన్న టూరిస్ట్ హోటల్‌లో బస చేయించడం,*
*కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి ఇది పరాకాష్ట*
*నారా లోకేష్ వైఫల్యంపై ‘తెలుగు శక్తి’ ఆగ్రహం*
*రాష్ట్రపతి పర్యటనను వాయిదా వేయాలి*
---- *తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్*
విశాఖపట్నం: విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రథమ ఘటికోత్సవం (కాన్వకేషన్) నిర్వహణ తీరుపై ‘తెలుగు శక్తి’ అధ్యక్షుడు బి.వి.రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో నిర్వహించాల్సిన ఈ ప్రతిష్టాత్మక వేడుకను, దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ని అడ్డం పెట్టుకుని విశాఖపట్నంలోని ‘నోవాటెల్’ అనే ప్రైవేట్ హోటల్‌లో జరపడం వెనుక పెద్ద వ్యాపార ప్రమోషన్ దందా దాగి ఉందని ఆయన నిప్పులు చెరిగారు. ఈ అక్రమ వేడుకలపై విచారణ జరిపి, జూన్ 30న జరగబోయే రాష్ట్రపతి పర్యటనను తక్షణమే వాయిదా వేయాలంటూ శనివారం ఆయన రాష్ట్రపతికి ఒక బహిరంగ లేఖ రాశారు.
ఈ సందర్భంగా బి.వి.రామ్ శనివారం ఉదయం హోటల్ మేఘాలయ, విశాఖపట్నం లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, వర్సిటీ అధికారుల తీరును కరెక్ట్‌గా ఎండగట్టారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ వచ్చినప్పుడు ఆంధ్రా యూనివర్సిటీ ఓపెన్ గ్రౌండ్స్‌లో భారీ సెట్స్ వేసి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. కానీ నేడు రాష్ట్రపతి ని తీసుకువచ్చి, నోవాటెల్ హోటల్ ప్రమోషన్ కోసం, ప్రభు కిషోర్ అనే వ్యక్తి వ్యక్తిగత లాభం కోసం అక్కడ కాన్వకేషన్ పెట్టడం తెలుగు జాతికే అవమానకరమని మండిపడ్డారు. విశాఖపట్నంలో ప్రభుత్వానికి చెందిన 'ఋషికొండ ప్యాలెస్' అందుబాటులో ఉండగా, రాష్ట్రపతి లాంటి మహోన్నత వ్యక్తిని ఒక చిన్న టూరిస్ట్ హోటల్‌లో బస చేయించడం, ఈ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణానికి వందల కోట్ల నిధులు కేటాయించినప్పటికీ, విజయనగరం జిల్లా గజపతినగరం మండలం చినమేడపల్లిలో ఇప్పటివరకు భవనాలు నిర్మించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రెండేళ్లుగా శాశ్వత భవనాన్ని కట్టలేక, ఇప్పటికీ పాత ఏయూ క్యాంపస్ నుండి వర్సిటీని నడపడం సిగ్గుచేటన్నారు. క్యాంపస్ లేకపోతే విద్యార్థులను దిల్లీకి తీసుకువెళ్లి అక్కడైనా రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు ఇవ్వాలి కానీ, ఇలా ప్రైవేట్ హోటళ్లలో పెట్టి వర్సిటీ ప్రతిష్టను విశాఖలో మంటకలపవద్దని హితవు పలికారు. ఇది పేరుకే గిరిజన యూనివర్సిటీ అని, కానీ ఇక్కడ గిరిజనులకే చోటు లేదని రామ్ ఆరోపించారు. ఇక్కడ మొత్తం చదువుతున్న 400 మంది విద్యార్థుల్లో కనీసం 25 మంది కూడా గిరిజన విద్యార్థులు లేరని లేఖలో స్పష్టం చేశారు. అంత కంటే ఘోరం ఏంటంటే, ఇక్కడి టీచింగ్ ఫ్యాకల్టీలో కానీ, సిబ్బందిలో కానీ ఒక్కరంటే ఒక్క గిరిజన ఉద్యోగి కూడా లేరని, వర్సిటీ యాజమాన్యం పూర్తిగా అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పనిచేస్తూ గిరిజన హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. గిరిజన సంక్షేమం పట్ల అపారమైన గౌరవం ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము .. గిరిజనులను మోసం చేస్తున్న ఈ అక్రమ విశ్వవిద్యాలయ వేడుకలకు వచ్చి వీరికి లబ్ధి చేకూర్చవద్దని బి.వి.రామ్ కోరారు. కేంద్ర నిధుల దుర్వినియోగం, గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని, అంతవరకు ఈ కాన్వకేషన్ పర్యటనను నిలిపివేయాలని తెలుగు శక్తి తరఫున ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
రాష్ట్ర విద్యాశాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ఈ గిరిజన విశ్వ విద్యాలయ వ్యవహారంలో పూర్తిగా విఫలమయ్యారని బి.వి.రామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యువనేతగా, ఐటీ, విద్యా రంగాల్లో సంస్కరణలు తెస్తానని ప్రగల్భాలు పలికే లోకేష్.. కళ్లెదుటే కేంద్ర నిధులు పక్కదారి పడుతున్నా, గిరిజన హక్కులు కాలరాయబడుతున్నా కనీసం పట్టించుకోకపోవడం ఆయన పరిపాలనా దక్షతకే మచ్చ అని విమర్శించారు. వందల కోట్ల కేంద్ర నిధులు చేతిలో ఉన్నప్పటికీ, గడచిన రెండేళ్ల కాలంలో ఒక్క శాశ్వత భవనాన్ని కూడా పూర్తి చేయించలేకపోయిన లోకేష్, విద్యాశాఖపై తనకున్న పట్టులేమిని స్వయంగా నిరూపించుకున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తుల వ్యాపార ప్రయోజనాల కోసం రాష్ట్రపతి పర్యటనను వాడుకుంటున్న తీరును కూడా లోకేష్ అడ్డుకోలేకపోవడం, ఆయన శాఖలోని అధికారుల ఇష్టారాజ్యానికి, నిఘా వైఫల్యానికి పరాకాష్ట అని రామ్ దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూరు నికుంజ్, ఎం.శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.