--:-- | Today 28°C · Weather
Breaking

స్మార్ట్ సిటీ" అంటే కేవలం రోడ్లపై రంగులు వేయడం కాదు... నడిచే వాడికి రక్షణ కల్పించడం* #vvwnews

Jun 25, 2026 4:17 5 views 1

Description

*"స్మార్ట్ సిటీ" అంటే కేవలం రోడ్లపై రంగులు వేయడం కాదు... నడిచే వాడికి రక్షణ కల్పించడం*

*ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్*

*ఫుట్‌పాత్‌ల పై అడ్డంకులు లేకుండా నడవడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు*

*సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు*

---- *ఎమ్మెల్యే సీహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్*

విశాఖపట్నం: మహానగరం విశాఖ లో స్మార్ట్ సిటీ పేరుతో కోట్ల రూపాయల నిధులు కుమ్మరిస్తున్నా, సామాన్య పౌరుల కనీస హక్కులైన ఫుట్‌పాత్‌లు (కాలిబాటలు) మాత్రం ఆక్రమణల గుప్పిట్లో చిక్కుకుపోవడం పై తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో నడవడానికి వీలులేక ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రధాన రోడ్లపైనే ప్రయాణించాల్సి రావడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.

ఇదే విషయంపై జనసేన పార్టీ నగర అధ్యక్షుడు మరియు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సీహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ దృష్టికి గురువారం ఉదయం ఆయన క్యాంప్ ఆఫీస్, శివాజీ పార్క్ దగ్గర తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ వినతి పత్రం సమర్పించారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో బి.వి.రామ్ మాట్లాడుతూ నగరంలో కనుమరుగవుతున్న కాలిబాటలు, తద్వారా సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టు తీర్పును తుంగలో తొక్కుతున్నారు! ఫుట్‌పాత్‌ల పై అడ్డంకులు లేకుండా నడవడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు నిచ్చినా, వైజాగ్‌లో అధికారులు దానిని తుంగలో తొక్కుతున్నారు" అని బి.వి.రామ్ ధ్వజమెత్తారు. జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, హనుమంతువాక, గాజువాక, డాబాగార్డెన్స్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాలలో ఫుట్‌పాత్‌లు పూర్తిగా వ్యాపార స్థలాలుగా మారిపోయాయని దుయ్యబట్టారు. పెద్ద పెద్ద వ్యాపార సముదాయాల యజమానులు తమ షాపుల మెట్లు, డిస్‌ప్లే బోర్డులను కాలిబాటల పైకే నిర్మించి, సామాన్యులను రోడ్ల మీదికి నెట్టేస్తున్నారని ఆరోపించారు.
కమర్షియల్ కాంప్లెక్స్ ల బేస్‌మెంట్‌లను పార్కింగ్‌కు కాకుండా గోడౌన్లుగా వాడుతుండటంతో, వాహనాలన్నీ రోడ్లపైనే పార్క్ అయి విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.

*అధికారుల అండదండలతోనే ఆక్రమణలు!*

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మరియు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు కేవలం ప్రదర్శన కోసమే తాత్కాలిక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారని, కొందరు స్థానిక నేతలు, అధికారుల అండదండలతోనే ఈ ఆక్రమణలు శాశ్వతంగా సాగుతున్నాయని ఆరోపించారు. పూర్ణా మార్కెట్ పరిసరాల్లో ప్రతి నెలా మొదటి వారంలో నడవడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

*'తెలుగు శక్తి' తరఫున ప్రభుత్వానికి డిమాండ్లు*

*ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు:*

జీవీఎంసీ మరియు ట్రాఫిక్ పోలీసులు కలిసి ఉమ్మడిగా ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, ఫుట్‌పాత్‌లను శాశ్వతంగా ఆక్రమణల నుండి విముక్తి చేయాలి.

*షాపుల యజమానులపై కఠిన చర్యలు:*

ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన పెద్ద వ్యాపార సంస్థలు, నిబంధనలు ఉల్లంఘించిన కమర్షియల్ కాంప్లెక్స్ ల లైసెన్సులను రద్దు చేయాలి.

*వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయం:*

చిన్న వ్యాపారుల పొట్ట కొట్టకుండా, వారికి ప్రత్యేకంగా 'వెండర్ జోన్స్' కేటాయించి, కాలిబాటలను కేవలం పాదచారులకే పరిమితం చేయాలి.

"స్మార్ట్ సిటీ అంటే కేవలం రోడ్లపై రంగులు వేయడం కాదు, నడిచే వాడికి రక్షణ కల్పించడం. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే, సామాన్య ప్రజలను సమీకరించి 'తెలుగు శక్తి' తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం" అని బి.వి.రామ్ హెచ్చరించారు.

అనంతరం ఎమ్మెల్యే సీహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ తప్పకుండా చర్యలు తీసుకుంటానని తెలుగు శక్తి అధ్యక్షులు బి.వి.రామ్ హామీ ఇచ్చారు.

Related Videos