*మేజర్ పోర్టు ఉద్యోగులకు వేజ్ బోర్డులో అంగీకరించిన అంశాలు వెంటనే అమలు చేయాలి*
– ధర్నాలో వక్తల డిమాండ్
మేజర్ పోర్టు ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలోని వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపుమేరకు శుక్రవారం పోర్టు చైర్మన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ యూనియన్ గౌరవ అధ్యక్షులు వి.ఎస్. పద్మనాభరాజు మాట్లాడుతూ, 2018, 2024 ద్వైపాక్షిక వేతన చర్చల (BWNC) ఒప్పందాలలో అంగీకరించినప్పటికీ అమలు కాని క్లాజులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ సమస్యను పరిష్కరించి, ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు ప్రొటెక్టెడ్ పే అమలు చేయాలని, గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఎల్‌ఆర్ (బోనస్) బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు.
వేతన ఒప్పందంలో అంగీకరించిన ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ఉద్యోగులపై పని భారం పెంచడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించాలని అన్నారు. 2025 ఫైనాన్స్ బిల్లు ద్వారా పెన్షన్ హక్కులపై జరుగుతున్న దాడులను నిలువరించి, సీసీఎస్ పెన్షన్ నిబంధనల్లో ప్రతిపాదించిన మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మాన్‌పవర్ ప్లానింగ్, కోర్–నాన్ కోర్ విభజన పేరుతో విశాఖపట్నం పోర్టులో ఉద్యోగుల సంఖ్యను 2,000 నుంచి 1,034కు తగ్గించే ప్రయత్నాలను విరమించుకోవాలని ఆయన కోరారు. సీహెచ్‌డీఎల్ క్యాజువల్, పోర్టు పూల్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు “సమాన పనికి సమాన వేతనం” సూత్రాన్ని అమలు చేయాలని, ప్రస్తుతం అమలులో ఉన్న 12 గంటల విధానాన్ని రద్దు చేసి 8 గంటల విధి విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే పోర్టు అలవెన్సులను సవరించి, పోర్టు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్ విధానాలను నిలిపివేయాలని కోరారు.
ఈ ధర్నాకు ఫెడరేషన్ కార్యదర్శి బి. జగన్, యూనియన్ అధ్యక్షులు సామమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ సి.హెచ్. త్రినాధరావు అధ్యక్షత వహించగా, జె.డి. లక్ష్మి, సోమేశ్వరరావు, అప్పలరాజు కేఎస్ కుమార్, కనకరాజు శ్రీను, శివ తదితర నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేశారు.
ఇట్లు,
బి. జగన్
కార్యదర్శి, సీఐటీయూ
వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా