--:-- | Today 28°C · Weather
Breaking

అందరి జీవితాల్లో ఆనంద జ్యోతులు వెలగాలి**చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి*

Nov 7, 2026 7:54 5 views 3

Description

*అందరి జీవితాల్లో ఆనంద జ్యోతులు వెలగాలి*

*చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి*

*జర్నలిస్టుల మధ్య ఘనంగా బ్రహ్మకుమారీస్ దీపావళి సంబరాలు*

*ప్రమిదలు, మిఠాయిలు పంపిణీ చేసిన అతిథులు* – *పెద్ద సంఖ్యలో పాల్గొన్న పాత్రికేయులు*

డాబాగార్డెన్స్, అక్టోబర్ 7, విశాఖపట్నం:

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ నిలుస్తుందని, ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్షించారు.

శనివారం డాబాగార్డెన్స్‌లోని వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్‌క్లబ్‌లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, జర్నలిస్టులు సంయుక్తంగా నిర్వహించిన దీపావళి వేడుకలు అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దీపావళి అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లోని చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగించే పవిత్ర పర్వదినమని పేర్కొన్నారు. దీపావళి వెలుగులు ప్రతి ఇంటా ఆనందం, సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, సోదరభావంతో పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సామరస్యం, ఐక్యత వెల్లివిరియాలని, పేద, ధనిక తేడా లేకుండా అందరి జీవితాల్లో ఆనందం నిండాలని కోరుకున్నారు. నిరంతరం ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టుల మధ్య ఇలాంటి ఆత్మీయ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని అన్నారు.

నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ దీపావళి పండుగకు ఉన్న విశిష్టత, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని వివరించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో దీపావళి సందర్భంగా నిర్వహించే సంప్రదాయాలు, దుష్టశక్తులను దీపాల వెలుగులతో తరిమికొట్టే ఆచారాలను ప్రస్తావించారు. జగన్మాత ఆదిపరాశక్తి అసుర సంహారం అనంతరం ఉగ్రరూపం నుంచి శాంత స్వరూపంలోకి వచ్చిన పురాణ ఘట్టాన్ని వివరిస్తూ అమ్మవారి మహిమ, శక్తి స్వరూపం, పండుగ అంతరార్థాన్ని తెలియజేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, డాక్‌యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో ఆనందం, ఆత్మీయత, ఆధ్యాత్మిక చైతన్యం నింపాలనే ఉద్దేశంతో బ్రహ్మకుమారీస్ సంస్థ సహకారంతో పండుగలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజానికి నిరంతరం సేవలందించే జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. జర్నలిస్టులకు తన పరిధి మేరకు అండగా నిలవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే శక్తిని, అవకాశాలను ఆ పరమాత్ముడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని, అటువంటి సేవల ద్వారా పేదరిక నిర్మూలనకు కొంతవరకు దోహదపడవచ్చని పేర్కొన్నారు.

ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బీకే రామేశ్వరి మాట్లాడుతూ దీపావళి అంటే చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే పండుగ అని అభివర్ణించారు. ప్రతి ఇంటా దీపాలు వెలిగించి, పర్యావరణానికి హాని కలగకుండా కాలుష్యరహిత దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పురాణ ఇతిహాసాల్లో దీపావళికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందని వివరించారు.

ఆత్మీయ సత్కారాలు.. దీపావళి కానుకల పంపిణీ

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, ప్రత్యేక అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. జర్నలిస్టులకు అతిథుల చేతుల మీదుగా ప్రమిదలు, మిఠాయిలు, ఇతర దీపావళి సామగ్రిని పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న పాత్రికేయులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. సీనియర్ పాత్రికేయులు ఆర్. నాగరాజు పట్నాయక్ స్వాగత ఉపన్యాసం చేశారు. బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు, పలువురు సీనియర్ జర్నలిస్టులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక సందేశాలు, ఆత్మీయ పలకరింపులు, పండుగ కానుకల పంపిణీతో ప్రెస్‌క్లబ్‌లో దీపావళి సంబరాలు సందడిగా సాగాయి.

Related Videos

దుర్గమాంబ నవరాత్రి వేడుకల్లో మహా అన్నసమారాధన.. పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ!
Nov 7, 2026

దుర్గమాంబ నవరాత్రి వేడుకల్లో మహా అన్నసమారాధన.. పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ!

శ్రీ దుర్గమాంబ రెడ్డి ఐక్యత సేవా సంఘం ఆధ్వర్యంలో విశాఖ పూర్ణామార్కెట్ సమీపం పండా వీధిలో టీడీపీ సీనియర్ నాయకులు బుచ్చా రామిరెడ్డి పర్యవేక్షణల…

Watch Now