జీవీఎంసీ పోలింగ్ లెక్కల్లో భారీ తేడా ఎలా వచ్చింది?.
*తొలుత 51.47 శాతం.. తుది నివేదికలో 56.32 శాతం నమోదు*
*89,239 ఓట్ల వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వాలని తెలుగు శక్తి డిమాండ్*
---- *ప్రభుత్వాన్ని, ఎన్నికల అధికారులను ప్రశ్నించిన తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్*
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికల పోలింగ్ గణాంకాల్లో వెలుగుచూసిన వ్యత్యాసంపై సోమవారం ఉదయం వీ.జే.ఎఫ్ ప్రెస్ క్లబ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ప్రభుత్వాన్ని, ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. ఒకే ఎన్నికకు సంబంధించి అధికారులు తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, తుది నివేదికలో వెల్లడించిన పోలింగ్ శాతానికి ఇంత తేడా రావడానికి కారణమేంటని ఆయన నిలదీశారు. ఈ గణాంకాలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఎన్నికల అధికారులపై ఉందని పేర్కొన్నారు.
నవంబర్ 1న జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు పోలింగ్ నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 18,37,901 మంది ఓటర్లకు గాను 9,45,915 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం 51.47గా నమోదైనట్లు ప్రకటించారు.
అయితే నవంబర్ 2న తుది గణాంకాల ప్రక్రియ పూర్తయిన అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించిన వివరాల్లో మొత్తం 10,35,154 మంది ఓటు వేసినట్లు, పోలింగ్ శాతం 56.32గా నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ రెండు అధికారిక ప్రకటనలను పోల్చి చూస్తే ఏకంగా 89,239 ఓట్ల వ్యత్యాసం కనిపిస్తోందని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ప్రశ్నించారు?. పోలింగ్ శాతంలోనూ 4.85 శాతం పాయింట్ల తేడా ఉండటంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
**ఒకే ఎన్నికకు రెండు లెక్కలెందుకు?**
పోలింగ్ పూర్తయిన వెంటనే వెల్లడించిన గణాంకాలు ఒకలా, తుది లెక్కల పేరుతో ప్రకటించిన వివరాలు మరోలా ఉండటానికి కారణమేంటని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ప్రశ్నించారు. తొలుత ప్రకటించిన 51.47 శాతం పోలింగ్ లెక్కల్లో తప్పులున్నాయా? ఉంటే ఆ వివరాలను ప్రజలకు ఎందుకు వెల్లడించలేదు? తుది గణాంకాల్లో అదనంగా 89,239 ఓట్లు ఎలా చేరాయి? ఈ మార్పునకు ఆధారమైన నివేదికలు ఏమిటి? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జోన్ల వారీగా పోలింగ్ వివరాలు, ప్రతి పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్ల సంఖ్య, రిటర్నింగ్ అధికారులు సమర్పించిన నివేదికలు, తుది గణాంకాల వివరాలను బహిరంగంగా వెల్లడించాలని కోరారు. గణాంకాల్లో ఇంతటి వ్యత్యాసం ఉన్నప్పుడు సందేహాలు వ్యక్తం కావడం సహజమని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు.
**పారదర్శకతపై సమాధానం చెప్పాలి**
నవంబర్ 3న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో, అంతకుముందే పోలింగ్ గణాంకాల్లో వచ్చిన వ్యత్యాసంపై పూర్తి స్పష్టత ఇవ్వాలని బి.వి. రామ్ కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కలగాలంటే ప్రతి దశలో పారదర్శకత ఉండాలని, అధికారికంగా ప్రకటించిన రెండు వేర్వేరు గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలను ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగం ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.