--:-- | Today 28°C · Weather
Breaking

జాతీయ జెండాలతో గిన్నిస్ ప్రపంచ రికార్డు 40 వేల ఉన్ని త్రివర్ణ పతాకాలతో విశాఖ మహిళల అపూర్వ ఘనత

Aug 2, 2026 6:12 4 views 1

Description

జాతీయ జెండాలతో గిన్నిస్ ప్రపంచ రికార్డు

40 వేల ఉన్ని త్రివర్ణ పతాకాలతో విశాఖ మహిళల అపూర్వ ఘనత

ప్లాస్టిక్ రహితం – పర్యావరణ హితమే లక్ష్యం

విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రప్రభ):
పర్యావరణ పరిరక్షణతో పాటు దేశభక్తి సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పే లక్ష్యంతో విశాఖపట్నంలో నిర్వహించిన 'లార్జెస్ట్ క్రోషే బంటింగ్' కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. 'మహిళా మనోవికాస్' ఆధ్వర్యంలో పోర్ట్ స్టేడియంలో దాదాపు 40 వేల ఉన్నితో తయారు చేసిన జాతీయ జెండాలను వరుసగా ప్రదర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

ఈ రికార్డు సాధన కోసం వందలాది మంది మహిళలు సుమారు 24 గంటల పాటు శ్రమించి విశేష కృషి చేశారు. 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమం స్ఫూర్తితో చేపట్టిన ఈ కార్యక్రమం ముగింపు వేడుక వెంకోజీపాలెంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ దంగారీకర్ అధికారిక రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని నిర్వాహకులకు అందజేశారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏసీపీ జి. భవ్యరెడ్డి మాట్లాడుతూ, మంచి సంకల్పం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ కార్యక్రమం నిరూపించిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా భారతీయులు ఉన్నితో జాతీయ జెండాలను తయారు చేసి పంపడం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళల సమిష్టి కృషి దేశభక్తి, పర్యావరణ స్పృహ, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిందని కొనియాడారు.

ఇంటాక్ విశాఖపట్నం చాప్టర్ ప్రతినిధి డాక్టర్ డి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగానికి బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. యువత కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.

కార్యక్రమ నిర్వాహకురాలు మాధవి సూరిభట్ల మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన 'హర్ ఘర్ తిరంగా' పిలుపు స్ఫూర్తితో 40 వేలకుపైగా ఉన్ని జాతీయ జెండాలను తయారు చేసినట్లు తెలిపారు. త్వరలో వాటిని ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ నిర్మూలనలో మహిళల పాత్ర కీలకమని, ప్రతి మహిళ ముందడుగు వేస్తే కుటుంబం మొత్తం మార్పు దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనాక్షి అనంతరామ్ తదితరులు పాల్గొన్నారు.

Related Videos