విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
తూర్పు నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చాలి: వైఎస్సార్‌సీపీ జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షులు పీలా ప్రేమ్ కిరణ
విశాఖపట్నం నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షులు పీలా ప్రేమ్ కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నం మద్దిలపాలెంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రేమ్ కిరణ్ మాట్లాడుతూ, ప్రపంచ పటంలో సుందరమైన నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం ప్రస్తుతం తాగునీటి సమస్యతో వార్తల్లో నిలుస్తోందన్నారు. గత కొన్ని రోజులుగా ప్రజలు కనీసం గుక్కెడు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలోని వాసవానిపాలెం, శివగణేష్ నగర్, ఎంవిపి కాలనీ వెంకోజిపాలెం సింహాద్రిపురం ఆరిలోవ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఉదయం నుంచే నీటి కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ పనులకు వెళ్లాల్సిన సమయంలో నీటి కోసం క్యూలలో నిలబడుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రజల తాగునీటి సమస్యపై తక్షణమే స్పందించాలని ప్రేమ్ కిరణ్ కోరారు. ప్రజలు మూడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నాయకుడిగా నియోజకవర్గంలోని ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చే బాధ్యత ఆయనపై ఉందన్నారు. వినాయక చవితి కార్యక్రమాలు, పెద్దమనిషి ఫంక్షన్ లో పేరంటాలు కార్యక్రమాలు వాటిల్లో పాల్గొనడం గానీ ప్రజలు యొక్క కష్టాలు తెలుసుకొని నీటి సమస్య ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరిగి ఎంత మందికి భరోసా కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు.నీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణమే ఉచిత వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందించాలని ప్రేమ్ కిరణ్ డిమాండ్ చేశారు. నీటి ట్యాంకర్ల కోసం సామాన్య కుటుంబాలు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇది ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచుతోందని అన్నారు. ప్రజలందరూ కూడా రెండు మూడు రోజులు ఇంటి వద్దనే ఉండి పని కూడా వెళ్లకుండా వేచి చూడాల్సిన పరిస్థితి తూర్పు నియోజకవర్గంలో నెలకొంది. పోనీ రోడ్డు పక్కన ఉన్న హ్యాండ్ బోర్లైన ఉపయోగిద్దాం అంటే అభివృద్ధి పేరుతో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి హ్యాండ్ బోర్లు అన్నీ కూడా తీసివేయడం జరిగింది. ఉన్న అరకురా హ్యాండ్ బోర్ లైన వాడి నీరు తెచ్చుకుందాం అంటే అవి కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. జీవీఎంసీ ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్ తెప్పించుకుందామంటే ఈ కూటమి ప్రభుత్వంలో నీళ్లను కూడా బ్లాక్లో 1500 నుండి 3000 చొప్పున అమ్ముకునే పరిస్థితినెలకొంది. ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు తీసుకురాగలిగారు గాని ప్రజల ఇంటికి నీళ్లను మాత్రం తీసుకు రాలేకపోయారు కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పరిధిలో ప్రజలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అయితే ఇది ప్రభుత్వ బాధ్యతకు ప్రత్యామ్నాయం కాదని, అధికార యంత్రాంగం శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో లోతైన బోర్లు వేసి నీటిని వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. తాగునీటి సరఫరా, హ్యాండ్ బోర్ల మరమ్మతులు, నీటి ట్యాంకర్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రేమ్ కిరణ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు కి నేషనల్ మీడియా వాటర్ మాన్ గా బిరుదు ఇచ్చారని ఆయన చెప్పుకున్నారని వాటర్ మ్యాను కాదు మాకు తెలియదు కానీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రం కోటర్మేనని ప్రజలు బిరుదు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఉదయం 6 గంటలకి ఆరులో ప్రాంతానికి వెళితే నీటి కోసం గొడవలు ఆడుకుని ఒకరిమీద ఒకరిని ఒకరు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. మీకు ఆరిలోవ ప్రాంతానికి దారి తెలియకపోతే చెప్పండి ఎమ్మెల్యే గారు నేను తీసుకెళ్లి మీకు చూపిస్తా అని అన్నారు. డేటా సెంటర్ పేరుతో జరుగుతున్న పనుల వలన కొండమీద నుంచి రిజర్వాయర్ లోకి వచ్చే వర్షపు నీరు కూడా వచ్చే దారి లేక ఆగిపోయింది. డేటా సెంటర్ ప్రారంభం కాకముందే ఎంత నీటి ఎద్దడికి గురైతే ఒకవేళ డేటా సెంటర్ ప్రారంభమైతే జనాలు పరిస్థితి ఏంటని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రజలందరూ ని కలిసి భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలేమిటి నీరు ఏ విధంగా తీసుకొస్తారు అని ప్రజలకు చెప్పే బాధ్యత మీకు ఉంది అని అన్నారు. విశాఖపట్నంలో అప్పనంగా 99 పైసలకే ఎకరా భూమి దొరుకుతుంది కానీ విశాఖ వాసుల భవిష్యత్తు ఆలోచించి నీటి సమస్య పరిష్కారం దిశగా ఇంటింటికి ప్రభుత్వం ఉచితంగా ఇంకుడు గుంతలు మాత్రం తీయించి ఆలోచన చేయదు అని అన్నారు.సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించి, తక్షణమే ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజల ప్రాథమిక అవసరమైన మంచినీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని, రాజకీయాలకు అతీతంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.