*బర్మా కాలనీలో ప్రభుత్వ భూమి ఆక్రమణలపై కాందీశీకుల సంక్షేమ సంఘం, బీసీవై పార్టీ ఆగ్రహం..*
ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు, బర్మా కాలనీ పరిధిలో ఉన్న సుమారు 9 ఎకరాల 40 సెంట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని, ఆ అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని కాందీశీకుల సంక్షేమ సంఘం, భారత చైతన్య యువజన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బర్మా కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులతో కలిసి వారు మాట్లాడారు.. సర్వే నెంబర్ 13/1P పరిధిలోని ఈ భూమి మనభూమి యాప్, రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తిస్థాయి ప్రభుత్వ భూమిగా నమోదై ఉందని నాయకులు స్పష్టం చేశారు. మార్కెట్ విలువ ఎక్కువగా ఉండటంతో కొందరు పారిశ్రామిక వేత్తలు, అక్రమార్కులు తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టుల చుట్టూ తిప్పుతూ, అక్కడ అక్రమంగా షెడ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి వెంటనే ఆ షెడ్లను తొలగించి భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. బాధితుల పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందన్నారు. ఈ వ్యవహారాన్ని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లి, రానున్న ఎన్నికల వేళ ఈ అంశంపై రాష్ట్రస్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరీ దీపక్, బీసీవై పార్టీ నాయకులు అంజూరి దీపక్, నమ్మి అప్పలరాజు, అల్లు రమణ, నాయుడు, సంఘం ప్రతినిధులు నరసింహులు, వాణి తదితరులు పాల్గొన్నారు.